మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. గత మూడు రోజులుగా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గడంతో మన్యం వాసులు గజగజ వణుకుతున్నారు. చింతపల్లి 10, లంబసింగి 8, డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగ, పాడేరు, అరకులోయలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమో దైంది. ఉదయం పదిన్నర గంటల వరకు పొగ మంచు దట్టంగా కురుస్తుండగా, ఆ తరువాత నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఎండ కాస్తున్నది. నాలుగు గంటల నుంచి యథావిధిగా చలి తీవ్రత మొదలవుతున్నది. రాత్రి వేళల్లో ఇళ్లల్లో ఉన్నా ఆరుబయట ఉన్నట్టుగా చలి ప్రభావం చూపుతున్నది. దీంతో గిరిజ నులు ఉన్ని దుస్తులు ధరించి, చలి మంటలు కాగుతూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం వల్ల మరోసారి కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లిలో 10, లంబసింగి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోద్ అవుతుంది. నవంబరులో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత 8 డిగ్రీలు నమోదైనప్పటికీ వరుస అల్పపీడనాల ప్రభావం వల్ల కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం మరోసారి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత పెరిగింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చల్లగాలులు వీస్తున్నాయి. ఉదయం వేళల్లో మంచు దట్టంగా కురుస్తున్నది. ఉదయం 10 గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదు. స్థానికులు చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఉన్నిదుస్తులు ధరించుకుని కనిపిస్తున్నారు. కాగా నెలాఖరు నాటికి కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశ ముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.