ఢిల్లీకి చెందిన సీనియర్ పోలీస్ అధికారి జితేంద్ర మణి బరువు తగ్గి అందరినీ షాక్‌కు గురి చేశారు. 130 కిలోల బరువున్న ఆయన 8 నెలల్లో 46 కేజీల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపర్చారు. జితేంద్ర మణి ప్రస్తుతం ఢిల్లీలో డీసీపీగా పని చేస్తున్నారు. ఈయనకు ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలని నిర్ణయించుకున్న జితేంద్ర.. తన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకున్నారు. బరువు తగ్గడానికి రోజూ 15 వేల అడుగులు నడిచేవారు. అలాగే హెల్తీ ఫుడ్‌ను ఆహారంగా తీసుకున్నారు. అలా 8 నెలలో 46 కేజీల బరువు తగ్గడంతో తన తోటి అధికారులు, కుటుంబీకులు షాక్‌కు గురవుతున్నాయి. జితేంద్ర మణి డెడికేషన్ చూసి పలువురు ప్రశంసిస్తున్నారు. పోలీస్ శాఖ తరఫున ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ ఆరోడా సర్టిఫికేట్‌ను కూడా అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జితేంద్ర మణి మాట్లాడుతూ..‘మొదట్లో నా బరువు 130 కిలోలు ఉండేది. అధిక బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడ్డాను. నా శరీరం కూడా సహకరించలేని పరిస్థితికి చేరుకుంది. అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఎలాగైనా బరువు తగ్గాలని అనుకున్నాను. నెలకు 4.5 లక్షల అడుగులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. 8 నెలల్లో 32 లక్షల అడుగుల మేర నడిచారు. అలా 130 కేజీల బరువు నుంచి 84 కేజీల బరువుకు చేరారు. నా నడుము చుట్టుకొలత 12 అంగుళాలు తగ్గింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది.’ అని తెలిపారు.