యర్రగొండపాలెం, మార్కాపురం కేంద్రాలుగా రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ దందాలో కొంతమంది వ్యాపారులు, ఎండీయూ ఆపరేటర్లు, డీలర్ల కనుసన్నల్లోనే ఈ దందా కొనసాగుతోంది. వీరికక్కుర్తితో ఇంటింటికి రేషన్ బియ్యం పథకం ద్వారా కార్డుదారులకు నేరుగా సరుకులు అందజేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరు గారి పోతోంది. ప్రధానంగా అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణం. డీలర్లే అనధికారికంగా పంపిణీలో జోక్యం చేసుకుంటున్నారు. కార్డుదారులకు కిలోకు రూ.10 ఇచ్చి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. డీలర్లతో ఎండీయూలు కుమ్మక్కు కావడంతో ఈ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకే ఇంటింటికి రేషన్ బియ్యం పథకాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఎక్కడా పంపిణీ సక్రమంగా సాగడం లేదు. రేషన్‌బియ్యం ఇంటింటికి పోకుండా అడ్డదారిలో నల్లబజారుకు తరలిపోతోంది. కంభం మండలంలోని 31 రేషన్ దుకాణాలకు గాను 1897 క్వింటాళ్లు, అర్థవీడు మండలంలో 26 రేషన్ దుకాణాలకు గాను 1575 క్వింటాళ్లు, బేస్తవారపేట మండలం లో 39 రేషన్‌షాపులకు గాను 2179 క్వింటాళ్లు, బియ్యం ప్రతినెలా పంపిణీ చేయాల్సి ఉంది. అయితే వీటి సరఫరా సక్రమంగా జరుగుతున్న దాఖలాలు లేవు.