రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నిరుద్యోగులు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు. కల్లూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. 400 రోజులు 4000 కిలోమీటర్లు పాద యాత్ర చేపట్టనున్న మాజీ మంత్రి నారా లోకేష్ యువతను తట్టిలేపుతూ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించనున్నారని తెలిపారు. ఉద్యోగాల్లేక యువత అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెరుగు పురుషోత్తంరెడ్డి, కె.పార్వతమ్మ, ఆకెపోగు వెంకటస్వామి, బాల వెంకటేశ్వరెడ్డి, ప్రభాకర్ యాదవ్, మహేష్‌గౌడు, గంగాధర్‌గౌడు, ఫిరోజ్, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, పీయూ మాదన్న, కల్లూరు మండల టీడీపీ కన్వీనర్ డి.రామాంజనే యులు, వాకిటి మాదేష్, ఎన్వీ రామకృష్ణ, పవన్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.