చంద్రన్న కానుకల పంపిణీ పేరుతో అమాయక నిరుపేద ప్రజలను బలితీసుకున్నారని, గుంటూరులో జరిగిన ఘటన మానవ ప్రేరిత దుర్ఘటన అని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు తొక్కిసలాటలో మృతిచెందిన కుటుంబాలను మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల చొప్పున పరిహారం మృతుల కుటుంబాలకు అందజేశారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 19 మంది క్షతగాత్రులను పరామర్శించారు. వారికి కూడా ప్రభుత్వం ప్రకటించిన రూ.50 చొప్పున పరిహారాన్ని మంత్రులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. ‘‘గుంటూరు దుర్ఘటనలో ముగ్గురు చనిపోయారు. 19 మందికి గాయాలయ్యాయి. వారిలో 5 మంది పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. గుంటూరులో జరిగింది మానవ ప్రేరితమైన దుర్ఘటన, కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉంటే ముగ్గురి ప్రాణాలు పోయేవి కాదు, 19 మంది గాయపడేవారు కాదు. రాజకీయంగా ఎందరు ఏమి మాట్లాడినా వాస్తవాలను ప్రజలు గమనించాలి అని అన్నారు.