గుంటూరు జిల్లా, పెదకాకాని,మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీగంగాభ్రమరాంబాసమేత శ్రీచంద్రశేఖరస్వామి 80వ ఆర్థ్ర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కూరెళ్ల వెంకట చంద్రశేఖరప్రసాద్, ఆర్థ్రమహోత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, స్వామివారికి అలంకరణలతో పాటు సాం్కృతిక కార్యక్రమాలు మంగళవారం వరకు జరుగుతాయన్నారు. సుమారు వందేళ్ల క్రితం కూరెళ్ల పీతాంబరం కాశీ నుంచి శివలింగాన్ని తీసుకువచ్చి గ్రామంలో ప్రతిష్ఠించగా, 1927లో కూరెళ్ల వెంకటసుబ్బయ్య ఆలయ పునః ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత కాట్రపాటి వెంకటసుబ్రహ్మణ్యం, మోపర్తి వెంకటసుబ్బయ్య, కూరెళ్ల వెంకటసుబ్బయ్యలు 79 సంవత్సరాల క్రితం మహోత్సవాలు మొదలు పెట్టారు. ఈ ఉత్సవాలు గ్రామస్తులు, నిర్వాహక సంఘం ఆధ్వర్యంలో నిరంతరాయంగా కొనసాగుతుండగా ప్రస్తుతం 80వ వార్షికంలోకి అడుగుపెట్టాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రభాతసేవ, మహన్యాసపూర్వక ఆర్ర్ధాభిషేకం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. తొలిరోజు అమ్మవారి మూలవిరాట్ బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుందన్నారు. శనివారం సహస్రకుంకుమార్చన, ఆదివారం రుద్రాభిషేకం, సోమవారం వీరభద్రస్వామివారికి పూజ, లక్ష బిల్వార్చన, విష్ణుసహస్రనామస్తోత్రపారాయణం, మంగళవారం వేంకటేశ్వరస్వామి పూజ, ఆంజనేయస్వామివారికి పూజ, క్షీరాభిషేకం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు.