ప్రదర్శనలు, సభలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్‌షోలు, ర్యాలీలు నిషేధించేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం అనంతపురం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లాక్‌టవర్ సమీపంలో గాంధీవిగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాంభూపాల్ మాట్లాడు తూ... రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ జీఓను తీసుకొచ్చిందన్నారు. ఇప్పటికే కార్మికులు, రైతులు, ప్రజలు తమ కోర్కెలు, హక్కుల కోసం ఆందోళనలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అణచివేస్తోందని, ముందస్తు అరెస్టులు చేస్తోందని అన్నారు. సభలకు, ర్యాలీలకు అనుమతినివ్వడం లేదని తెలిపారు. ఈ జీఓ అమలు చేయడమంటే ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాతంత్రవాదుల నోరు నొక్కే ప్రయత్నమేనన్నారు. కార్యక్రమంలో సీపీఎం నగర కమిటీ సభ్యులు వలి, ప్రకాష్, మసూద్, బాబు, గఫూర్, రాజు, ఫయాజ్, దాదు, ఇస్మాయిల్, ఫకృ, బీహెచ రాయుడు, దస్తగిరి, శ్రీరాములు, సురేష్ పాల్గొన్నారు.