ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 స్ర్కీనింగ్ పరీక్ష ఈనెల 8న జరుగనుంది. ఇందుకోసం విజయనగరం జిల్లాలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5530 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ సూర్యకుమారి కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ విజయనగరం పట్టణంలోనే 13 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. పర్యవేక్షణకు ప్రతి పరీక్ష కేంద్రానికీ సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాలను గుర్తించి ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, ప్రత్యేక సిబ్బందిని నియమించాలని చెప్పారు. రూట్‌ల వారీగా బస్సు సదుపాయం కల్పించాలని ఆర్‌టీసీ అధికారులకు ఆదేశించారు. ప్రతి సెంటర్‌లో డైరెక్షన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండలని, మెడికల్ కిట్‌లు అందుబాటులో ఉంచాలని అన్నారు. సమావేశంలో డీఆర్‌వో గణపతిరావు, లైజన్ అధికారులు పాల్గొన్నారు.