కుప్పంలో తనను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ అంటే వణుకు పుడుతోందని అన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ 'ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. కుప్పం నా సొంత నియోజకవర్గం. గత నెలలోనే కుప్పం వస్తానని చెప్పాను. డీజీపీకి కూడా సమాచారం ఇచ్చాను. రోడ్ షోలు పెట్టకూడదని ప్రభుత్వం జీవో తెచ్చింది. సీఎం దయాదాక్షిణ్యాలతో సమావేశాలు పెట్టాలని ఆంక్షలు పెట్టారు. వైసీపీ సభలకు రాని జనాలకు పెన్షన్లు కట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం. తిరిగే స్వేచ్ఛ, హక్కు ఉంది. నేను అనుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేసేవాడా? రోడ్లపై నేను మాట్లాడకూడదా? ఆకాశంలో మాట్లాడాలా? ప్రభుత్వానికి టీడీపీ అంటే వణుకు పుడుతుంది. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి. ఏ చట్ట ప్రకారం ఈ జీవో తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోకు చట్టబద్దత లేదు' అని అన్నారు.