ఏపీలో ఎమర్జెన్సీ విధించారు అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ రాష్ట్రం ఏమైనా నీ జాగీరా జగన్ రెడ్డీ? అని లోకేశ్ ప్రశ్నించారు. కుప్పంపై వైసీపీ పోలీసులు ఏకంగా అప్రకటిత యుద్ధాన్నే ప్రకటించారని విమర్శించారు. బ్రిటీష్ చట్టానికి బూజు దులిపి అర్ధరాత్రి జీవో ఇచ్చారని... తెల్లారేసరికి అదే చట్టాన్ని జగన్ ఉల్లంఘించాడని మండిపడ్డారు.
చట్టం మీ ఎదుగూరి సందింటికి ఎదురింటి చుట్టమా? అని ప్రశ్నించారు. ఎన్ని అరాచకాలకు పాల్పడినా నీపై వ్యతిరేకత తగ్గదని జగన్ పై మండిపడ్డారు. చంద్రబాబుకు జనాదరణ పెరుగుతూనే ఉంటుందని అన్నారు. కుప్పం 35 ఏళ్లుగా నీలాంటి కుట్రదారులను ఎంతోమందిని చూసిందని చెప్పారు. కుప్పం తెలుగుదేశం కోట అని.. ఇక్కడ నీ కుప్పిగంతులు చెల్లవని అన్నారు. పసుపుసైన్యం కదం తొక్కుతోందని... తల్లకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు కుప్పం పర్యటనను అపలేవని చెప్పారు.