సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు సమన్వయంతో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించి 2024 ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ విజయానికి బాటలు వేయాలని ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, చిత్తూరు జెడ్పి చైర్మన్,నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఉరవకొండ లోని వీరశైవ కల్యాణ మండపంలో వజ్రకరూరు మండల సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు, వైయస్ఆర్‌సీపీ ముఖ్య నేతలతో సమావేశాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి, శ్రీనివాసులు మాట్లాడుతూ.... సీఎం వైయస్ జగన్ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ప్రజలకు ఇంటి వద్దే అందించే లక్ష్యంతో సచివాలయ, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు.ఏపీ లోని సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను జగన్ తీసుకొచ్చారని వలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు సమన్వయంతో ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవచూపాలన్నారు.