పుడింగి అంటే చంద్రబాబుకు అర్థం తెలుసా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. రాజకీయాల్లో దిగజారుడుతనంతో మాట్లాడటం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. కుప్పంలో తన ఓటమి స్పష్టంగా కనిపిస్తుండటంతో మానసిక సంతులతను కోల్పోయి చంద్రబాబు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని విమర్శించారు. చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...కుప్పంలో చంద్రబాబు నా గురించి పుంగనూరు పుడంగి అంటూ వ్యాఖ్యలు చేశాడు. అసలు పుడింగి అంటే చంద్రబాబుకు అర్థం తెలుసా? ఆ మాటకు అర్థం ఆయన కంటే బలవంతుడు అని. అంటే చంద్రబాబు కంటే నేనే బలవంతుడిని అని ఆయనే ఒప్పుకుంటున్నాడు. కుప్పంలో చంద్రబాబు వరుసగా స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చూశాడు. తన నియోజకవర్గంలోనే గెలుపునకు దూరమైన ఆయన పుంగనూరులో నాపైన పోటీ చేస్తాను అనడం హాస్యాస్పదంగా ఉంది. శ్రీ వైయస్ జగన్ గారి ఆధ్వర్యంలో పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబును మూడు చెరువుల నీరు తాగించిన మాట వాస్తవం కాదా? ఇలాంటి వ్యక్తి పుంగనూరులో నా కథ ఏమిటో తేలుస్తాను అని బీరాలు పలుకుతున్నాడు. చంద్రబాబే కాదు ఆయన తాతలు దిగి వచ్చినా నా కథ తేల్చడం వారి తరం కాదు.