కాంగ్రెస్ ప్రభుత్వం 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయితీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిందని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ తులసి రెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ. ఈ సవరణ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో గ్రామ పంచాయితీలకు సర్పంచులు అలాగ, కానీ వైకాపా పాలన గ్రామ పంచాయితీలు, సర్పంచులను ఉత్సవ విగ్రహలుగా, గారకాయలుగా, ఆరవ వ్రేలుగా తయారు చేయడం శోచనీయమన్నారు. గ్రామ పంచాయితీలు నిధులు, విధులు, అధికారాలు లేక నిర్వీర్యం అయ్యాయి.
రూ. 8660 కోట్లు కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించడం గర్హనీయం. నిధులు లేక గ్రామ పంచాయితీలు చిన్న చిన్న పనులు కూడా చేయలేక పోతున్నాయన్నారు. వాలంటరీ, సచివాలయ వ్యవస్థల ద్వారా రాజ్యాంగ బద్దమైన గ్రామ పంచాయితీ వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. దారి మళ్ళించిన రూ. 8660 కోట్లను తిరిగి గ్రామ పంచాయితీ ఖాతాలలో వెయ్యాలి. వాలంటరీ, సచివాలయ వ్యవస్థలను గ్రామ పంచాయితీ ఆధీనంలోకి తేవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. సర్పంచుల ఉద్యమ బాటకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.