ఇటీవల కాలంలో రైల్లోని టీసీలు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు. తాజాగా ఊహించని అనూహ్య ఘటన ఒకటి రైల్లో జరిగింది. రైలులో టికెట్ తనిఖీలకు వచ్చిన ఇద్దరు అధికారులు కోపంతో ప్రయాణికుడిపై దాడి చేశారు. దీనిపై రైల్వే శాఖ సీరియస్ గా స్పందించింది. ఇద్దరు టీసీలను విధుల నుంచి సస్పెండ్ చేసింది. టికెట్ తనిఖీ పేరుతో రైలులోకి ప్రవేశించిన తనిఖీ అధికారులు (టీసీలు), ప్రయాణికుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సదరు ప్రయాణికుడు రైలులో పై బెర్త్ మీద కూర్చున్నాడు. దీంతో ఇద్దరు టీసీల్లో ఒకడు ప్రయాణికుడి కాలు పట్టుకుని కిందకు లాగేందుకు ప్రయత్నించగా, అతడు రెండు చేతులతో బెర్త్ కు ఉన్న ఐరన్ రాడ్ ను పట్టుకుని బలంగా నిరోధించాడు. దీంతో ఇద్దరు టీసీలు ప్రయాణికుడి కాళ్లను చెరొకరు పట్టుకుని బలమంతా ఉపయోగించి కిందకు ఈడ్చి పడేశారు. అతడు ఒక్కసారిగా కింద పడిపోగా, ఒక టీసీ అతడి నడుముపై తన్నగా, మరో టీసీ ముఖంపై తన్నాడు.
దాడి చేసే హక్కు లేదంటూ టీసీలను తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. ఈ ఎపిసోడ్ ను ఒకరు తన సెల్ ఫోన్ లో బంధించారు. ముంబై నుంచి జైనగర్ వెళుతున్న రైలులో దోలీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 2న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. బాధితుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు సమాచారం. దీనిపై రైల్వే శాఖ అధికారి ఒకరు స్పందిస్తూ ఇద్దరు టీసీలను వెంటనే సస్పెండ్ చేశామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు