ఏపీ ప్రజలు మాట్లాడే హక్కును కోల్పోయారని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్వాతంత్ర్య సమరం నాటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని... ఆయన వైఖరిని ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు కూడా ఇష్టపడటం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పారు.
అసలు సొంత నియోజకవర్గం కుప్పంలో తిరిగే స్వేఛ్చ కూడా చంద్రబాబుకు లేదా? అని జేసీ మండిపడ్డారు. రోజురోజుకూ వైసీపీ కార్యకర్తల జోరు తగ్గుతోందని... ఇదే సమయంలో పోలీసులే వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చెత్త బండ్లను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని... భవిష్యత్తులో పోలీసులే చెత్త ఎత్తుతారేమో అని ఎద్దేవా చేశారు. కావాలంటే చెత్త ఎత్తుకోండి... మమ్మల్ని మాత్రం ఎత్తకండి అని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.
కుప్పంలో చంద్రబాబు పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగిందని... ప్రజలను రక్షించడానికే చంద్రబాబు అవస్థ పడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. మార్చి నెల నాటికి రాష్ట్రంలో లోకల్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లపై తీవ్ర ఆంక్షలు విధించే అవకాశం ఉందని అన్నారు.