చలికారణంగా మన తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. మరీ హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి ఏమిటో అంచనా వేయవచ్చు. ఉత్తర భారతంలో చలి వణికిస్తోంది. కనీస ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు మైనస్ లో నమోదవుతున్నాయి. పలుచోట్ల రోడ్లపై మంచు పేరుకుపోతోంది. రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన కులూ జలపాతం గడ్డకట్టింది. ఉష్ణోగ్రతలు మైనస్ లో నమోదవుతుండడంతో ఎత్తునుంచి పడుతున్న నీరు మొత్తం గడ్డకట్టింది. జలపాతం పైనుంచి కిందిదాకా మంచు తోరణంలా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ పర్యాటకుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. హైవేలపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. పలు రైళ్లతో పాటు కొన్ని విమానాలను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.