చైనాలో జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేసిన తర్వాత కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోవడంతో మన దేశం వెంటనే అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మాస్క్ లు ధరించాలని, జన సమూహంలో సంచరించొద్దని, శానిటైజర్లు వాడాలని సూచనలు చేసింది. అంతేకాదు, భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ సూచించారు. కేంద్రం అయితే హెచ్చరించింది కానీ, మన దేశంలో ఎక్కడా కరోనా మార్గదర్శకాలను ప్రస్తుతం ఆచరిస్తున్నట్టు కనిపించడం లేదు.
మూడు వారాల నుంచి చైనా నిత్యం లక్షలాది కేసులతో వణికిపోతోంది. మన దేశానికి వాయు మార్గాలను కూడా మూసివేయలేదు. అంతర్జాతీయంగా అన్ని దేశాలకు భారత్ నుంచి సర్వీసులు నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే రిస్క్ ఉన్న చైనా, తదితర కొన్ని దేశాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మన దేశంలో ఇప్పటికీ రోజువారీ కరోనా కేసులు 100-200 మధ్యలోనే ఉంటున్నాయి. గత ఆదివారంతో ముగిసిన వారంలో మన దేశంలో కొత్తగా 1,268 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంలో ఇవి 1,526గా ఉన్నాయి. అంతేకాదు, గడిచిన ఆరు వారాల నుంచి వారం వారీ కేసులు 2,000లోపే ఉంటున్నాయి. మన దగ్గర కరోనా రిస్క్ లేదనడానికి ఈ గణాంకాలను నిదర్శనంగా నిపుణులు పేర్కొంటున్నారు. గత వారం ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే కేసులు రెట్టింపయ్యాయి. కేరళలో కేసులు, మరణాలు ఎక్కువగా వచ్చాయి. జనవరి 2-8 మధ్య 383 కేసులు నమోదు కాగా, ఏడు మరణాలు చోటు చేసుకున్నాయి. కర్ణాటకలో 225 కేసులు వచ్చాయి.