ఈపీఎఫ్ లో ఇటీవల పలుమార్పులు వచ్చాయి. ఇదిలావుంటే ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పేరుతో ఓ సామాజిక భద్రతా పథకాన్ని కేంద్ర కార్మిక శాఖ పరిధిలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ వో) నిర్వహిస్తుంటుంది. ఈపీఎఫ్ సభ్యులు 58-60 ఏళ్లకు రిటైర్ అయిన తర్వాత నుంచి ప్రతి నెలా పింఛను అందుకోవడానికి అర్హులు. ఇందుకోసం ఉద్యోగుల భవిష్య నిధితోపాటు, పెన్షన్ స్కీమ్(ఈపీఎస్ 95) కూడా ఒకే ఖాతా కింద కొనసాగుతుంటాయి. అయితే ఈపీఎఫ్ కు సంబంధించి చాలా ఫీచర్లు ఉన్నాయి.
ఈఫీఎఫ్ లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి.. ఉద్యోగి దురదృష్టవశాత్తూ మరణిస్తే, అతడిపై ఆధారపడిన కుటుంబం లేదా తల్లిదండ్రులు జీవించినంత కాలం పింఛను పొందేందుకు అర్హులు. ఉద్యోగి లేదా ఉద్యోగిని కోల్పోయిన తల్లిదండ్రులకు జీవించి ఉన్నంత కాలం పింఛను ఇవ్వాలని ఈపీఎఫ్ వో నిబంధనలు చెబుతున్నాయి. కాకపోతే కొన్ని షరతులు ఇందుకు వర్తిస్తాయి.
ఇందులో ప్రధానమైనది ఉద్యోగి మరణించే నాటికి పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ ఉద్యోగి సర్వీస్ లో ఉండగా ఏదైనా ప్రమాదం లేదా వ్యాధి కారణంగా వైకల్యం పాలైనా జీవించి ఉన్నంత కాలం పింఛన్ కు అర్హులు. ఉద్యోగి పనిచేయలేని విధంగా వైకల్యం పాలైతే పింఛను పొందేందుకు 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేయాలన్న నిబంధన లేదు. ఉద్యోగి వేతనం నుంచి (మూలవేతనం, డీఏ కలిపి గరిష్ఠంగా రూ.15,000) 12 శాతం ఈపీఎఫ్ కు వెళుతుంది. సంస్థ కూడా ఉద్యోగి తరఫున 12 శాతం చందా అందిస్తుంది. అందులో 8.33 శాతమే భవిష్యనిధికి వెళుతుంది. మిగిలిన 3.67 శాతం పింఛను ఖాతాకు వెళుతుంది. దీన్నుంచే పెన్షన్ చెల్లింపులు చేస్తారు.