మిర్చి సాగు చేస్తున్న రైతులు నల్ల తామర పురుగు కారణంగా కష్టాల పాలవుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా రెండో ఏడాది కూడా రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ స్పందించాలని ఓ ప్రకటనలో చంద్రబాబు కోరారు. గతేడాది కూడా ఇదే కారణంతో మిర్చి పంట తీవ్రంగా దెబ్బతిందని, దిగుబడి తగ్గిపోయిందని ఆయన గుర్తుచేశారు.
నల్ల తామర పురుగు నుంచి మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు రకరకాల మందులు వాడడంతో పెట్టుబడి రెట్టింపు అవుతోందని వివరించారు. పురుగుమందుల ధరల నియంత్రణపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు. తామర పురుగు నుంచి పంటను కాపాడుకోవడానికి మిర్చి రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
బ్లాక్ త్రిప్స్ గా వ్యవహరించే కొత్త రకం పురుగే ఈ నల్ల తామర.. గతేడాది తెలుగు రాష్ట్రాలతో పాటు ఆరు రాష్ట్రాల్లోని 34 జిల్లాల్లో వేసిన మిర్చి పంటను నాశనం చేసింది. రైతులను తీవ్రంగా నష్టపరిచిందని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ ఆర్) నిపుణులు చెప్పారు. 2015లో తొలిసారి ఈ నల్ల తామర పురుగును గుర్తించినట్లు చెప్పారు. 2018-19 కాలంలో కర్ణాటకలోని అలంకరణ మొక్కలకు సోకిందని, 2021లో తొలిసారి మిర్చిపంటను ఈ పురుగు ఆశించిందని వివరించారు.