ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టిక్ ను ఇసుకతో రూపొందించి ప్రముఖ సైకత శిల్పి, ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ చాలా రోజుల విరామం తర్వాత తన కళాప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. 105 అడుగుల పొడవున్న ఈ హాకీ స్టిక్ ప్రపంచంలోనే పెద్దదిగా పట్నాయక్ ప్రకటించారు. కటక్ లోని మహానంది నదీ తీరంలో ఈ హాకీ స్టిక్ ను తీర్చిదిద్దారు.
2023 పురుషుల ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ కు ఒడిశా ఆతిథ్యమిస్తోంది. భువనేశ్వర్ లో కళింగ స్టేడియం, అలాగే రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం మ్యాచ్ లకు వేదికగా నిలవనున్నాయి. ఈ నెల 13 నుంచి 29 వరకు పోటీలు ఉంటాయి.ఇందుకు సంబంధించి కటక్ లో కర్టెన్ రైజర్ కార్యక్రమం నేటి సాయంత్రం జరగనుంది. ఈ ప్రపంచ కప్ నేపథ్యంలో సుదర్శన్ పట్నాయక్ తన సైకత కళతో చక్కని హాకీ స్టిక్ రూపొందించడం గమనార్హం. హాకీ స్టిక్ కోసం 5,000 హాకీ బాల్స్, ఐదు టన్నుల ఇసుకను ఆయన వినియోగించారు. 15 మంది విద్యార్థుల సాయంతో రెండు రోజుల్లో ఆయన దీన్ని నిర్మించారు.