వాహన రంగంలో మారుతి సుజుకి ఉన్న క్రేజ్ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మారుతి సుజుకి ఒక ప్రత్యేకమైన డిజైన్ తో ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. దీన్ని ఆటో ఎక్స్ పో 2023 (వాహనాల ఎగ్జిబిషన్) కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించింది. పోటీ సంస్థలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ తదితర సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించగా.. కార్ల మార్కెట్ లో సగానికి పైగా వాటా ఉన్న దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ కారును తీసుకురాలేదు.
ప్రజలు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరిగిన తర్వాత ఈ విభాగంలో మోడళ్లను తీసుకొస్తామని మారుతి సుజుకీ లోగడే ప్రకటించింది. అందులో భాగంగా తొలి ఎలక్ట్రిక్ కారును వాహనాల ఎగ్జిబిషన్ లో ఆవిష్కరించింది. ఈ కారు డిజైన్ మిగతా వాటికి భిన్నమైన లుక్స్ తో ఉండడాన్ని గమనించొచ్చు. కాకపోతే ఈ కారుకు సంబంధించి పూర్తి వివరాలను మారుతి సుజుకీ వెల్లడించలేదు.
4,300 మిల్లీమీటర్ల పొడవు, 1,800 ఎంఎం వెడల్పు, 1,600 ఎంఎం ఎత్తుతో ఇది ఉంది. దీని పేరు ఈవీఎక్స్ ఎలక్ట్రిక్. ఈ కారులో 60 కిలోవాట్స్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఒక్కసారి చార్జ్ తో 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. రెండేళ్లలో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడ్డానికి ప్రీమియం ఎస్ యూవీ మాదిరిగా ఉంది.