చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ నివాసంపై కొందరు దాడి చేసిన సంగతి తెలిసిందే. అతని ఇంటి తలుపులు పగులగొట్టి సామాన్లు ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలోని వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై అమిత్ షాకు రామచంద్ర ఫిర్యాదు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై, తన కుటుంబ సభ్యులపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేశారని అమిత్ షాకు చెప్పానన్నారు. పెద్దిరెడ్డిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అమిత్ షా చెప్పారని అన్నారు.