కరోనా దెబ్బకు చైనా అరిటాకుల వణుకుతోంది. అక్కడ కరోనా వైరస్ అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతోంది. ప్రతి రోజు లక్షలాదిమంది వైరస్ బారినపడుతున్నారు. మరణాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకు జీరో కొవిడ్ విధానాన్ని పాటించిన చైనా ఆ తర్వాత కరోనా ఆంక్షలు సడలించి, లాక్‌డౌన్లు ఎత్తివేసింది. దీంతో వైరస్ మరింతగా చెలరేగిపోయింది. రోజూ లక్షలాదిమందిని వైరస్ చుట్టుముడుతోంది. తాజాగా, చైనాకు సంబంధించి మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది.
ఒక్క హెనాన్ రాష్ట్రంలోనే దాదాపు 8.85 కోట్ల మంది కరోనా బాధితులుగా మారినట్టు ప్రావిన్షియల్ అధికారి కాన్ క్యూయాన్ చెంగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంటే రాష్ట్రంలోని దాదాపు 90 శాతం మంది కరోనా బారినపడినట్టు లెక్క. అలాగే, ఓడరేవు నగరం క్వాంగ్‌డావ్‌లో క్రిస్మస్ సమయంలో రోజుకు 5 లక్షల కేసులు వెలుగు చూసినట్టు చెప్పారు. దేశంలో కరోనా చెలరేగిపోతున్నప్పటికీ పర్యటనలకు మాత్రం జనం వెనక్కి తగ్గడం లేదు. శనివారం ఒక్క రోజే దాదాపు 3.4 కోట్ల మంది దేశంలో పర్యటించినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.