ఇటీవల ఏపీ క్యాడర్ కు బదిలీ అయిన తెలంగాణ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సీఎంను కలిసిన సోమేశ్ కుమార్.. సుమారు గంట తర్వాత సీఎం చాంబర్ నుంచి బయటకొచ్చారు. సోమేశ్ కుమార్ తో పాటు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఉన్నారు.
సోమేశ్ కుమార్ క్యాడర్ విషయంలో క్యాట్ ఆదేశాలను హైకోర్టు కొట్టేయడం, ఆ వెంటనే తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేశ్ ను రిలీవ్ కావాలని డీవోపీటీ సూచించడం తెలిసిందే. రెండు రోజులలోగా సొంత క్యాడర్ ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని డీవోపీటీ ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో గురువారం ఉదయం సోమేశ్ కుమార్ విజయవాడ చేరుకున్నారు. సచివాలయంలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి, జాయినింగ్ రిపోర్టు అందించారు.
అనంతరం జవహర్ రెడ్డితో కలిసి సీఎం జగన్ ని కలవడానికి ఒకే కారులో వెళ్లారు. గురువారం ఉదయం విజయవాడ చేరుకున్న తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ ఎయిర్ పోర్టులో మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీలో రిపోర్ట్ చేయడానికి వచ్చినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్ధమని చెబుతూనే.. ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని వివరించారు.
ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ కు వెళ్లడానికి మొదటి నుంచీ అసక్తి చూపని సోమేశ్ కుమార్.. ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వీఆర్ఎస్ తీసుకోవాలంటే ముందుగా ఏపీలో జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆపై వీఆర్ఎస్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. జాయిన్ కాకుండా వీఆర్ఎస్ ప్రక్రియ ముందుకెళ్లే అవకాశం లేదు. ఈ కారణంగానే సోమేశ్ కుమార్ ఏపీలో రిపోర్ట్ చేశారని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.