వైసీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వీరంకి గురుమూర్తి, టీడీపీ బీసీ సెల్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పిన్నింటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం లలిత కన్వెన్షన్ హాలులో కృష్ణాజిల్లా బీసీ సాధికార, జిల్లా బీసీ సెల్ విస్తృతసమావేశం నిర్వహించారు. టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా 4.04 లక్షల మందికి రూ.లక్ష వరకు సబ్సిడీతో రూ.2 లక్షల వ్యక్తిగత రుణాలు ఇచ్చామన్నారు. బీసీ ఫెడరేషన్ ద్వారా 70 వేల మంది రూ. 10 లక్షల చొప్పున గ్రూపు రుణాలు ఇచ్చామన్నారు. కార్పొరేషన్ ద్వారా రూ.12 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైసీపీ హయాంలో బీసీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారన్నారు. స్థానిక సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లు కుదించడంతో బీసీలు 16,800 పదవులు కోల్పోయారన్నారు. సామాజిక న్యాయమంటూ జగన్‌రెడ్డి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వచ్చే ఎన్నికల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. టీడీపీ బందరు ఎమ్మెల్యే పద వులను బీసీలకు ఇచ్చిందని, ఎంపీగా తనకు మూడుసార్లు అవకాశం కల్పించిందని టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. అంకెం ప్రభాకరరావుకు మంత్రి పదవి ఇచ్చారని, రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. తన తండ్రి కాగిత వెంకట్రావుకు టీడీడీ చైర్మన్ పదవి ఇచ్చారని, ఇప్పుడు పదవులన్నీ జగన్‌రెడ్డి తన వర్గం వారికే కట్టబెడుతున్నారని టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. కొనకళ్ల జగన్నాథరావు, రమాదేవి, ఈశ్వరరావు, లంకే నారాయణ ప్రసాద్, వంకా వెంకటేశ్వరరావు, చిత్తజల్లు నాగరాము, అక్కుమహంతి రాజా, జంపాన శ్రీనివాసరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.