దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ కథోలిక పుణ్యక్షేత్రంగా పేరొందిన, పెదఅవుటపల్లిలోని బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో మూడురోజుల పాటు నిర్వహించే తంబి 78వ వర్ధంతి మహోత్సవాలు(తిరునాళ్లు) శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మేరీమాతా కపూచియన్ ప్రొవిన్స్(ఎనికేపాడు) ఆంధ్ర, ఒడిసా, తెలంగాణా ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ కరుణాకర్ కాసు సమర్పించిన సమష్టి దివ్యపూజాబలితో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఫాదర్ కరుణాకర్ కాసు నేతృత్వంలో పలువురు గురువులు తంబి సమాధి వద్ద ప్రార్థనలు జరిపారు. అనంతరం పూజావస్త్రాలు ధరించి, బ్యాండు మేళాలతో దేవాలయం నుంచి ప్రదక్షిణగా కళావేదిక వద్దకు చేరుకుని దివ్యపూజ చేశారు. ప్రధాన గురువులు దివ్య సందేశాన్నందించారు. గురువులు, సిస్టర్లు, విశ్వాసులు, భక్తుల సమక్షంలో రెవరెండ్ ఫాదర్ కరుణాకర్ కాసు, తంబి పుణ్యక్షేత్రం రెక్టర్ రెవరెండ్ ఫాదర్ సుధాకర్ లారెన్స్‌లు నూతనంగా నిర్మించిన పునీతుల మార్గాన్ని ప్రారంభించారు. పునీతుల శిలా స్వరూపాలవద్ద ప్రార్థనలు చేశారు. గురుత్వ వార్షికోత్సవము జరు పుకొంటున్న రెవరెండ్ ఫాదర్ బోయపాటి ప్రవీణ్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఫాదర్లు యేసుపాదం, కుమార్‌రాజు, రమేష్, ఆస్పిన్, సమంత్ సమష్టి దివ్యపూజాబలి సమర్పించారు.