జయలక్ష్మి మ్యుచువల్లీ ఎయిడెడ్ మల్టీ పర్పస్ కోపరేటివ్ సొసైటీ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న మంగళపల్లి వెంకట సుబ్రహ్మణ్యకుమార్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పిటిషనర్‌తో పాటు ఇతర నిందితులుపై సుమారు 18కేసులు నమోదయ్యాయని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని గుర్తు చేసింది. పిటిషనర్‌ను ఇప్పటికే సీఐడీకి అప్పగిస్తూ ట్రయల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, ఈ దశలో బెయిల్ మంజూరు చేయలేమని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చారు. కాకినాడ కేంద్రంగా ఈ సొసైటీ చైర్మన్ రాయవరపు సీతారామాంజనేయులు, వైస్ చైర్మన్ బద్రీ విశాలాక్షితో పాటు మరికొందరు డైరెకర్లు సుమారు 19వేల మంది డిపాజిటర్ల నుంచి రూ.580 కోట్లు డిపాజిట్లు సేకరించారు. సొసైటీ యాజమాన్యం నిధులను సొంతానికి వాడుకొని భారీగా ఆస్తులు కూడబెట్టుకుంది. దగ్గర బంధువులకు ఇష్టారీతిన రుణాలు ఇచ్చింది. ఆడిట్‌లో సొసైటీ అక్రమాలు వెలుగులోకి రావడంతో కాకినాడ జిల్లా కోపరేటివ్ అధికారి బి.కనకదుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదుచేసింది. శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా.. సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ... ప్రజలకు అధికవడ్డీ ఆశచూపి నిందితులు భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించారన్నారు. ఆ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.