జగన్‌రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం నుంచి తరిమేసిన పరిశ్రమల విలువ రూ.10 లక్షల కోట్లని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. గత టీడీపీ ప్రభుత్వం ఎంతో శ్రమతో తెచ్చిన వాటిని మూర్ఖత్వంతో తరిమికొట్టి ఇప్పుడు పెట్టుబడుల సదస్సులు పెడితే ఏం ఉపయోగమని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘పోయిన ప్రాజెక్టులన్నీ లెక్కవేస్తే వాటి విలువ రూ.10 లక్షల కోట్లు. వాటిని రాష్ట్రం నుంచి తరమేసింది ఈ సైకో సీఎం కాదా? మేం ఆధారాలతో సహా నిరూపిస్తాం. కాదనే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా?’’ అని సవాల్ విసిరారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సబ్సిడీల కింద తాము రూ.1,600 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం ప్రచారం చేసుకొంటోందని, దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ముందుకొచ్చే ధైర్యం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఆయన సీఎం అయిన తర్వాత ఉన్న పరిశ్రమలను కూడా తరిమేసి మొత్తం భూములన్నీ తానే కబళిస్తున్నారన్నారు.