గ్యాస్ సిలిండర్ డెలివరీకి రూ.30 అదనంగా వసూలు చేసిన ఏజెన్సీకి అనంతపురం జిల్లా వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. వినియోగదారుడికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు ఎం.శ్రీలత తీర్పు వెలువరించారు. అనంతపురం నగరానికి చెందిన ఆర్.లక్ష్మీప్రసాద్ గుత్తి రోడ్డులోని హెచ్‌పీ గ్యాస్ హనుమాన్ ఏజెన్సీ వినియోగదారుడు. 2019 అక్టోబరు 7న రీఫిల్ సిలిండర్ కోసం బుక్ చేశాడు. బిల్లు మొత్తం చెల్లించినా.. రూ.30 అదనంగా చెల్లించాలని, లేకుంటే సిలిండర్ డెలివరీ ఇవ్వనని డెలివరీబాయ్ సిలిండర్‌ను వెనక్కు తీసుకువెళ్లాడు. దీంతో వినియోగదారుడు వెంటనే జిల్లా సివిల్ సప్లై అధికారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో డెలివరీ బాయ్ సిలిండరును ఇంటి ముందు ఉంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఏజెన్సీ నిర్వాహకుడి దృష్టికి బాధితుడు తీసుకువెళ్లగా.. సిలిండర్ సరఫరా ఖర్చులు ఉంటాయని, అలా అడగడం సహజమని సమర్థించుకున్నారు. మరుసటి నెల రీఫిల్ కోసం ప్రయత్నం చేయగా, సదరు ఏజెన్సీ నుంచి వినియోగదారుడిని బదిలీ చేసినట్లు తెలిసింది. దీంతో వినియోగదారుడు అవాక్కయ్యాడు. ఈ ఘటనపై 2020 జనవరి 20న వినియోగదారుడు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు. అదే ఏడాది సెప్టెంబరు 30న జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి, ఏజెన్సీ నుంచి రూ.4,15,000 పరిహారం ఇప్పించాలని కోరాడు. వినియోగదారుడి ఆరోపణలపై జాయింట్ కలెక్టర్ కోర్టులో విచారణ జరిగింది. గ్యాస్ ఏజెన్సీ రూ.2,500 జరిమానా చెల్లించి, డెలివరీ బాయ్‌ను విధుల నుంచి తొలగించింది. కాబట్టి పరిహారం చెల్లించే పని లేదని వినియోగదారుల కమిషన్ ఎదుట హనుమాన్ గ్యాస్‌ఏజెన్సీ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు శ్రీలత, సభ్యులు గ్రేస్‌మేరీ, గోపినాథ్‌తో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది. ఫిర్యాదుదారుడు తన ఆరోపణలను రుజువు చేశారని పేర్కొంది. ఫిర్యాదుదారులాగా పట్టుదలతో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసే ఓపిక చాలామందికి ఉండదని కమిషన్ అభిప్రాయపడింది. నిబంధనలకు వ్యతిరేకంగా చెల్లించే అదనపు డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరవని పేర్కొంది. ఫిర్యాదుదారుడికి గ్యాస్ ఏజెన్సీ రూ.లక్ష పరిహారం నెలలోగా చెల్లించాలని ఆదేశించింది.