ప్రమాణాలు పాటించని సుమారు వంద బీఈడీ కాలేజీలపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అఫిలియేషన్లపై అన్ని యూనివర్సిటీలతో శుక్రవారం జరిగిన సమావేశంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 399 బీఈడీ కాలేజీలున్నాయి. వాటిలో చాలావరకు ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఈ సంవత్సరం తనిఖీల కోసం అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యం చేశారు. పలుమార్లు దీనిపై ఉన్నత విద్యాశాఖ సమావేశాలు నిర్వహించి... ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తున్న వాటినే కొనసాగించాలని నిర్ణయించింది. తదనుగుణంగా చేసిన తనిఖీల్లో సుమారు వంద కాలేజీల్లో కనీస ప్రమాణాలు కూడా లేవని విద్యాశాఖ గుర్తించింది. సీట్లకు సరిపడా బోధనా సిబ్బంది లేరని, ల్యాబ్‌లు అస్సలు లేవని తనిఖీల్లో బయటపడింది. మరోవైపు ఒకే భవనంలో రెండు, మూడు కాలేజీలు నడుపుతున్న విషయం కూడా వెలుగులోకొచ్చింది. ఒకే భవనంలో వేర్వేరు అంతస్తుల్లో వేర్వేలు కాలేజీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీలకు అఫిలియేషన్లు పునరుద్ధరించకూడదని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది సుమారు 300 కాలేజీలు మాత్రమే బీఈడీ కోర్సులను అందిచనున్నాయి. ఇప్పటికే తనిఖీలు పూర్తిచేసినందున వెంటనే అఫిలియేషన్ల ఆర్డర్లు జారీచేయనున్నారు. ఆ తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నాలు చేస్తోంది.