నేడు విహార యాత్రలకు ప్రజలు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ దూరం ప్రయాణించే గంగా విలాస్ క్రూయిజ్ శుక్రవారం ప్రారంభమైంది. వారణాసి నుంచి దిబ్రూగఢ్ కు ప్రయాణించే ఈ క్రూయిజ్ కు డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని ఈ క్రూయిజ్ నిర్వాహక సంస్థ అంతారా లక్జరీ రివర్ క్రూయిజెస్ ప్రకటించింది. తొలి ప్రయాణంలో క్రూయిజ్ మొత్తం విదేశీయులతోనే నిండిపోయిందని సంస్థ సీఈవో రాజ్ సింగ్ చెప్పారు. ధర కాస్త ఎక్కువే అయినా డిమాండ్ తగ్గడంలేదని, ఈ క్రూయిజ్ కు 2024 మార్చి వరకు టికెట్లు బుక్ అయ్యాయని వివరించారు.
ఈ క్రూయిజ్ లో ప్రయాణించాలని అనుకుంటే అంతారా లక్జరీ క్రూయిజ్ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, 2024 ఏప్రిల్ తర్వాతే టికెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ షిప్ లో వారణాసి నుంచి దిబ్రూగఢ్ కు ప్రయాణించాలంటే మొత్తం 51 రోజులు పడుతుందని రాజ్ సింగ్ చెప్పారు.
ఇందుకోసం ఒక్కో టికెట్ సగటున రూ.20 లక్షలని చెప్పారు. ఇందులో ఒక్క రోజు ప్రయాణం చేయాలంటే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వెచ్చించాలని తెలిపారు. ప్రయాణంలో తమ అతిథులకు శాఖాహార భోజనం పెడతామని రాజ్ సింగ్ చెప్పారు. మాంసాహార భోజనం, ఆల్కహాల్ కు క్రూయిజ్ లో అనుమతి లేదని రాజ్ సింగ్ స్పష్టంచేశారు.