వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో తొలి రెండు టెస్టుల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. గాయంతో గతేడాది జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఈ జట్టులో చోటు లభించింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. పంత్ దాదాపు ఆరు నెలలపాటు జట్టుకు దూరం కానున్నాడు. కాగా, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ సిరీస్ ఎంతో కీలకం.
టీ20ల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌లకు టెస్టు జట్టులో స్థానం లభించింది. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. బ్యాకప్ వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ పేరును చేర్చారు. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని ఎంపిక చేయలేదు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.