కర్ణాటక ప్రజలకు హామీల వర్షం కురిపిస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మహిళలకు నగదు హామీలు ఇస్తోంది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.24 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు 'గృహ లక్ష్మి' పథకం గురించి ప్రచారం చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, 'గృహ లక్ష్మి' పథకం తీరుతెన్నులను వివరించారు. నగదును నేరుగా మహిళల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ప్రతి మహిళ స్వావలంబన సాధించడమే తమ లక్ష్యమని, ఈ దిశగా మహిళలకు తోడ్పాటు అందించడం కోసమే ఈ 'గృహ లక్ష్మి' పథకానికి రూపకల్పన చేసినట్టు ప్రియాంక గాంధీ వివరించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 'గృహ జ్యోతి' పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితం ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'గృహ లక్ష్మి' పథకంతో మహిళలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది