అధికార పార్టీ తన ప్రత్యర్థి పార్టీల నేతలపై వలవేయడం ఏపీ రాజకీయాలలో పరిపాటిగా మారింది. అధికార వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలపై ఫోకస్ పెట్టారు. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న లీడర్లు కొంతమందిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహిళా నేత.. వావిలాల సరళాదేవి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇన్నాళ్లూ టీడీపీలో ఉన్న సరళాదేవి.. అక్కడ తగిన గుర్తింపు లభించకపోవడంతో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆమె భర్త వావిలాల వెంకట రమేష్‌ను కూడా జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఇటు టీడీపీ కూడా చేరికలపై దృష్టి పెట్టింది. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేత కాండ్రు శ్రీనివాసరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ యువనేత నారా లోకేష్ సమక్షంలో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయానికి శ్రీనివాసరావు కృషిచేశారు. అయితే.. తనను పట్టించుకోకవడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. మరోసారి మంగళగిరి నుంచే బరిలోకి ప్లాన్ చేస్తున్న లోకేష్.. చేరికలపై ఫోకస్ పెట్టడంతో.. మరికొంత మంది కూడా సైకిల్ ఎక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.