సంక్రాంతి పండుగ రోజున సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య అట్టహాసంగా ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో సీట్లు నిండటమే గగనంగా మారింది. పండుగ రోజున ప్రారంభోత్సవం కాబట్టి ఎంపిక చేసినవారిని అనుమతించారు. అధికారికంగా కనుమ రోజున నుంచి మాత్రమే ఈ రైలు ప్రారంభమైనట్టుగా భావించాల్సి ఉంటుంది. ఆ ఒక్కరోజు తప్పితే ఈ రైలుకు ప్రయాణికులు పెద్దగా ఆదరణ చూపడం లేదనే చెప్పాలి.
మంగళవారం వందేభారత్‌లో సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉన్నట్టు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో కూడా సగానికి పైగానే సీట్ల లభ్యతను ఆన్‌లైన్ బుకింగ్‌లో చూపిస్తోంది. బుధవారం అంటే ఈ నెల 18న చైర్‌కార్‌లో 185 సీట్లు, 19న 544 సీట్లు, 20న 495 సీట్లు చొప్పున ఖాళీలు ఉన్నాయి. అలాగే 21న 535, 22న 632, 24న 621 సీట్లు ఖాళీగా చూపిస్తున్నాయి. పరిమిత సీట్లు ఉండే ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో జనవరి 21 వరకు వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. దీనిలో కూడా 23న 24, జనవరి 24న 26 సీట్లు ఖాళీగానే ఉన్నాయి.