శ్రీకాకుళం జిల్లా, బొండపల్లి మండలంలోని గొల్లుపాలెంలో ఓ ఆవు కళేబరం బుధవారం గుర్తించారు. ఆవును పులి చంపేసి చెరువులో పడిసిందని అటవీ అధికారులు తెలిపారు. నెల రోజుల కిందట ఈ ప్రాంతంలో పులి సంచరించిన విషయం విదితమే. మళ్లీ ఒక్కసారి ఓ ఆవుపై దాడి చేసి హతమార్చిన సంఘటన బుధవారం చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గొల్లుపాలెంలో రైతు పారాది చంద్రమోహన్ చెందిన ఆవు కళ్లంలో కట్టాడు. తెల్లవారే సరికి అక్కడ ఆవు లేదు. దీంతో సమీపంలోని పంతివాని చెరువులో కళేబరం ఉండడాన్ని స్థానికులు గుర్తించి అటవీశాఖాధికారులకు సమాచారం అందజేశారు. గ్రామానికి చెందిన పారాది చంద్రమోహన్ చెందిన ఆవుగా గుర్తించారు. ఆవును చంపివేసి దగ్గరలోని చెరువులోకి లాక్కొని వెళ్లి సగం తినేసి పడేసినట్లుగా అధికారులు నిర్ధారించారు. ఆవు కళేబరం ఉన్న ప్రాంతాన్ని ఎంపీడీవో ఎ.వేదవతితోపాటు అటవీశాఖ రేంజ్ అధికారి కేవీఎన్ రాజు పరిశీలించారు. సంఘటనా స్థలంలోనే గొల్లుపాలెం పశువైద్యశాల వైద్యాధికారితో పంచనామా నిర్వహించారు. కొద్దిరోజులుగా ఎటువంటి దాడులకు పాల్పడని పులి, ఒక్కసారిగా ఆవుపై దాడిచేయడంతో గ్రామస్థులతోపాటు సమీప గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు.