స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 30వ తేదీ సాయంత్రం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఉక్కునగరంలోని తృష్ణా మైదానంలో నిర్వహించనున్న ఉక్కు కార్మిక ప్రజా గర్జనలో కార్మికులు, నిర్వాసితులు, నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ కోరారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 707వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసి కాలయాపన చేయడం సమంజసం కాదని, ఇప్పటికైనా ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగాలని డిమాండ్ చేశారు. కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్యావసర సరకుల ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల జీవన విధానాలను అతలాకుతలం చేస్తున్న ప్రభుత్వాలకు చరమగీతం పాడాలన్నారు. ఉక్కు ప్రైవేటీకరణపై ఇప్పటికైనా కేంద్రం మొండి వైఖరిని విడనాడాలన్నారు. నాయకుడు అయోధ్యరామ్ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉక్కు కార్మికులతో నాటకాలు ఆడుతుందన్నారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ఉక్కు ఉద్యోగులు పాల్గొన్నారు.