తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సింహాద్రి ఎన్టీపీసీకి చెందిన దీపాంజలినగర్ టౌన్‌షిప్‌లో గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు తెలిపిన వివరాలిలా వున్నాయి. ఒడిశాకు చెందిన పంకజ్‌కుమార్ జెనా, రాజేశ్వరి పట్నాయక్(36) భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల క్రితం వివాహమైంది. జెనా సింహాద్రి ఎన్టీపీసీలోని బాయిలర్ నిర్వహణ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం 11 నెలల కుమారుడు ఉన్నాడు. దీపాంజలి నగర్ టౌన్‌షిప్ క్వార్టర్స్‌లో భార్యాభర్తలతోపాటు రాజేశ్వరి తల్లిదండ్రులు కూడా వుంటున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో బాబు ఏడుస్తున్నాడు. దీంతో రాజేశ్వరి తండ్రి సరోజ్ పట్నాయక్ బాబును ఎందుకు లాలించడం లేదంటూ కుమార్తెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె పడక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులను పలుమార్లు తట్టారు. అయినా లోపల నుంచి స్పందన లేకపోవడంతో తలుపులు విరగ్గొట్టారు. గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించిన కుమార్తెను చూసి షాక్ అయ్యారు. వెంటనే కిందకు దించి ఎన్టీపీసీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.