చిలకపాలేం టోల్ ప్లాజా కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని లేకుంటే వారితో పాటు ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటారని అఖిల పక్షాల పార్టీల నాయకులు తెలిపారు. జనవరి 23వ తేదీన అఖిలపక్ష రాయబారం సమావేశం తీర్మానించడం జరిగిందన్నారు. శ్రీకాకుళంలో చిలకపాలేం టోల్ ప్లాజా కార్మికుల పోరాటానికి మద్దతుగా అఖిల పక్ష పార్టీల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ చిలకపాలెం టోల్ ప్లాజాలో వస్తున్న ఆదాయాన్ని తగ్గకుండా మడపాం, నాతవలస టోల్ ప్లాజాల్లో టోల్ రుసుమును పెంచి సర్దుబాటు చేసినట్లుగానే కార్మికులను కూడా సర్దుబాటు చేయాలని డిమాండ్ చేసారు. చిలకపాలేం టోల్ ప్లాజాలో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న 106 మంది కార్మికులను రొడ్డున పడేయడం అన్యాయమ్నారు. నేషనల్ హైవే అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేషనల్ హైవే అధికారులు కార్మికులను రొడ్డున పడేసి గ్రాట్యూటీ, పరిహారం చెల్లించకుండా అన్యాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వేల కోట్ల రూపాయలు టోల్ రుసుములు వసూలు చేస్తున్న హైవే అధికారులు, కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. చిలకపాలేం టోల్ ప్లాజా కార్మికులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అర్ధాంతరంగా టోల్ ప్లాజా కార్మికులను రోడ్డున పడేస్తే వారి కుటుంబాలు ఏ విధంగా బ్రతకాలని అఖిల పక్షాల సదస్సులో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన. రవికుమార్ సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, జనసేన పార్టీ నాయకులు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.