నష్టాలు అన్న మాటకు భిన్నంగా ఎపీఎస్ ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త రికార్డు నమోదు చేసింది.. భారీగా రాబడిని ఆర్జించింది. రోజువారీ రాబడిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రికార్డుగా నిలిచిందని ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 18న ఒక్క రోజే రూ.23 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వచ్చినోళ్లు తిరుగు ప్రయాణాలతో రోజూ తిరిగే బస్సులతో పాటు, అదనంగా నడిపిన ప్రత్యేక బస్సుల రూపంలో ఈ ఆదాయం వచ్చింది అన్నారు ఎండీ ద్వారకా తిరుమలరావు.
ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీ లేకుండా సాధారణ ఛార్జీతో నడపటం వల్ల ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు అధికారులు అంటున్నారు. అంతేకాదు సంక్రాంతి సమయంలోనే ఆర్టీసీ కార్గో కూడా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో రూ.55 లక్షలు ఆర్జించింది. గతంలో ఇది రూ.45 లక్షలు ఉంటే.. ఆ రికార్డు కూడా బ్రేక్ అయ్యింది. సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడిపితే ప్రయాణీకులు ఆదరిస్తారనడానికి ఇదొక ఉదాహరణ అన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. ప్రయాణికులు ఈ సంక్రాంతికి తమ ప్రయాణ వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారన్నారు.
సంక్రాంతి రద్దీ ఉంటుందనే ముందస్తు అంచనాలతో ప్రయాణికుల కోసం ముందస్తుగా బస్సులను అందుబాటులో ఉంచడంతో పాటూ నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించడం, సమర్ధవంతంగా నిర్వహించామన్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినట్లుగా బస్సులను ఏర్పాటు చేయడం వల్లనే ఆర్టీసీ రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది అన్నారు. మరీ ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్ల అంకితభావం, వారి కృషి ఫలితంగానే ఆదాయం వచ్చిందన్నారు.
రాబోయే రోజుల్లో కూడా ఆర్టీసీ పట్ల ఇదే ఆదరణ చూపిస్తారని నమ్ముతున్నానని.. తమను ఆదరించిన ప్రయాణికులందరికీ ఆర్టీసీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, ఆర్టీసీ ఆదాయం పెంపుపై దృష్టి పెట్టామని ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ స్థలాలు గుర్తించి వాటిని పరిరక్షిస్తూ దీర్ఘకాలిక లీజుకు ఇస్తున్నామన్నారు.
మరోవైపు సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. మొత్తం రూ.141 కోట్ల ఆదాయం వచ్చిందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ ప్రాంతాలకు 3,392 ప్రత్యేక బస్సులను నడపటం ద్వారా ఆ రాబడి వచ్చినట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే 992 సర్వీసులు అదనంగా నడపడంతో రూ.34 కోట్ల ఆదాయం పెరిగింది అన్నారు. రాయితీ ప్రకటించడంతో పాటూ ప్రత్యేక సర్వీసుల్లోనూ సాధారణ ఛార్జీలే తీసుకున్నామన్నారు. అయినా సరే భారీగా రాబడి వచ్చిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa