కర్నూలు, అనంతపురం జిల్లాలపై జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు.. ఈ నెల 21న కర్నూలు జిల్లా, 22న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం కర్నూలు జిల్లా వీర మహిళల కోసం ఏర్పాటు చేసిన సభలో.. మధ్యాహ్నం జన సైనికులకు ఏర్పాటు చేసిన సభలో నాగబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. 22న ఆదివారం అనంతపురం జిల్లాలో వీర మహిళలు, జనసైనికుల కోసం ఏర్పాటు చేసిన సభల్లో నాగబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే.. నాగబాబు ఈ రెండు పర్యటించడానికి కారణం వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది.
కాపులంటే కేవలం కోస్తా జిల్లాల వారేనా.. రాయలసీమలోని బలిజలు కాదా..? అనే ప్రశ్న ఇటీవల తెరపైకి వచ్చింది. 30 ఏళ్ల కిందట ఎన్టీఆర్ 10 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. ఇప్పుడున్న పార్టీలు కనీసం ఒక్క స్థానం కూడా బలిజలకు ఇవ్వడం లేదని.. బలిజ నేత ఓవీ రమణ ఇటీవల వ్యాఖ్యానించారు. గతంలో చిరంజీవి తమవాడు అనుకున్నా.. వారికి సరైన గుర్తింపు దక్కలేదని చెప్పారు. ఇప్పుడు పవన్ కూడా తమవాడు అనుకుంటే.. కేవలం కోస్తా జిల్లాల కాపులనే హైలైట్ చేస్తున్నారని రమణ వాపోయారు. అదే సమయంలో జనసేన నేత బొలిశెట్టి సత్య వివరణ ఇచ్చారు.
'కాపులు 28 శాతం ఉన్నారు. ఎన్నికల ముందు జరిగే తంతు ఇప్పుడు మళ్లీ జరుగుతోంది. 14 శాతం ఉన్న బలిజలను ఎవ్వరూ గుర్తించడం లేదు. కాపు నేతల నాయకత్వంలో మేము పనిచేసినా.. మా గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఇప్పటివరకు బలిజలకు జరిగిన నష్టాన్ని ఎవ్వరూ ప్రస్తావించలేదు. అందుకే.. ఇప్పుడు బలిజలు వేరు అనే భావన వస్తోంది. ఎక్కడా బలిజ ప్రస్తావన రావడం లేదు. ఎన్టీఆర్ బలిజలను గుర్తించారు. వైఎస్సార్ కాపులను గుర్తించారు. ఇన్నాళ్లు మమ్మల్ని గుర్తిస్తారని ఆగాం. కానీ.. అది జరగడం లేదు' అని టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓవీ రమణ వ్యాఖ్యానించారు
'30 ఏళ్లు కిందట ఎన్టీఆర్ బలిజలకు 10 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు. రాజంపేట నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి బలిజ స్థానమే. కానీ.. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు. ఇన్నాళ్లు కాపుల సారధ్యంలో పనిచేశాం. మా ఆధ్వర్యంలో వారు పని చేయలేదు. ఒకానొక సమయంలో నాపై దాడి చేశారు. కాపులు త్యాగం చేసి మాకు ఇవ్వాలని మేము అడగటం లేదు. మాక్కూడా రాజకీయంగా హక్కులు ఇవ్వాలని కాపులు నేతలు అడగాలి. కాపు, బలిజ కలిస్తేనే బలం. అది వాళ్లు కూడా గుర్తించాలి' అని రమణ స్పష్టం చేశారు.
'ఎందుకు సీట్లు ఇవ్వడం లేదని రాజకీయ పార్టీలను నిలదీయాలు. ఇప్పుడు కాపులను, బలిజలను విభజించి పాలించాలని చూస్తున్నారు. కాపులు రాయలసీమలో లేరు. అక్కడి బలిజలకు సీటు ఇవ్వాల్సింది పార్టీలు. సామాజికవర్గం పెద్దది కాబట్టే.. రంగా చుట్టూ రాజకీయం తిరుగుతోంది. బలిజలను పాలేర్లుగా ఉంచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన పార్టీ తరఫున మేము భరోసా ఇస్తున్నాం. ఈసారి కచ్చితంగా జనసేన తరఫున 50 టికెట్లు ఇస్తాం' అని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బలిజలు అధికంగా ఉండే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నాగబాబు పర్యటించడం చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa