కొన్నేళ్లుగా తమ అనుభవంలో సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలంలోని కృష్ణారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు మహిళా రైతులు ,రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ.... గ్రామానికి చెందిన భూమిలేని నిరుపేదలు కొందరు కొన్నేళ్లుగా లింగాలవాగు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. త్వరలో జరగనున్న భూ పంపిణీలో ఆ పేదలకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. పట్టాలు మంజూరు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దారు సానా శ్రీనివాసులురెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కాకు విజయమ్మ పాల్గొన్నారు.