ప్రసిద్ధ పుణ్య క్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో ఫిబ్రవరి 18 నుంచి 20వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను భక్తులు మెచ్చుకునేలా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉత్సవాలకు రోజుకు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకొని వారికి ఎటువంటి సమస్యలూ రాకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, భాద్యతగా పనిచేయాలన్నారు. భక్తులు, వృద్ధులు, వికలాంగులకు, మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని అన్నారు. వంతెన వద్ద అధికారులు ప్రత్యేకంగా ట్రాఫిక్ పర్యవేక్షించాలని, సాగర్ కాలువ వద్ద మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా స్నానాల గదులు, బారికేట్ల్లు ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు అందించే వైద్యం విషయంలో అశ్రద్ధ వహించవద్దన్నారు. మంచినీరు, బయో టాయిలెట్లను ఏర్పాటుకు ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. సాగర్ కాలవపై రెండో వంతెనను నిర్మించేందుకు రూ.7.65 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మార్కాపురం సబ్‌కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ... అధికారులు ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. సమీక్షలో దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి, తహసీల్దారు కిరణ్, ఎంపీడీవో మరియదాసు, ఏఎంసీ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, సర్పంచ్ పి.వెంకటలక్ష్మి, ఆలయ చైర్మన్ పద్మావతి పాలక మండలి సభ్యులు, అధికారులు, సత్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.