విజయ డెయిరీలో 20ఏళ్ల నుంచి పనిచేస్తున్న కార్మికులను అన్యాయంగా తొలగించారని, వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని నంద్యాల సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తోట మద్దులు, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి గౌస్ హెచ్చరించారు. శుక్రవారం నంద్యాల పద్మావతినగర్ ఆర్చీ సెంటర్‌లో ధర్నా చేశారు. సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.... కార్మికులను అన్యాయంగా తొలగించారని అన్నారు. ఈ విషయాన్ని కార్మిక శాఖాధికారులు, కలెక్టర్, జేసీలకు వినతిపత్రాలు ఇచ్చినప్పుడు విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా విజయ పాల డెయిరీ యాజమాన్యం కార్మికులను విధుల్లోకి తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నాయకులకు డెయిరీ యాజమాన్యం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు బాల వెంకట్, ప్రసాద్, సుబ్బయ్య, ప్రభాకర్, నాగరాజు, గోపాల్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.