మన గణతంత్ర దేశంలో ఒక వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్రాలను గురించి భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలలో స్పష్టంగా పొందుపరచడం జరిగిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటే లోకేష్ భారత రాజ్యాంగం చేతిలో పట్టుకొని పాదయాత్ర చేస్తారని వెల్లడించారు. లోకేష్ పాదయాత్ర వైసీపీ ప్రభుత్వం వల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తిని పరామర్శిస్తూ.. అణిచివేయబడుతున్న గొంతుల్ని తట్టి లేపుతూ.. యువతకి, మహిళలకు భరోసా కల్పించడానికి ఆయన పాదం ముందుకు కదులుతుందని దేవతోటి పేర్కొన్నారు. జగన్ రెడ్డి 200 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆకాశమంత ఎత్తులో పెట్టి.. దళితుల్ని మాత్రం పాతాళంలోకి తొక్కేస్తున్నాడన్నారు. జగన్ రెడ్డి ప్రతి చర్య దళిత వ్యతిరేకి గానే ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో స్వేచ్ఛగా ప్రశ్నించలేని, నిరసనలు తెలపలేని, పరిస్థితులు ఉన్నాయంటే అది కచ్చితంగా నిరంకుశుత్వ పరిపాలనే అవుతుందని దేవతోటి తెలిపారు.