మార్చి నెలలో జరిగే జి-20 సదస్సు ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి జివిఎంసి ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆమె జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో కమిషనర్ పి. రాజాబాబు, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కట్టమూరి సతీష్, వైఎస్ఆర్ సిపి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, జివిఎంసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ మార్చి 28, 29 తేదీలలో ప్రతిష్టాత్మకంగా జరగబోయే జి-20 సదస్సు ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని ముఖ్యంగా ఏ శాఖ చేయవలసిన పనులు ఆ శాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించి పూర్తి చేయాలన్నారు. సుమారు 40 దేశాల నుండి 200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రోటోకాల్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
అనంతరం కమిషనర్ మాట్లాడుతూ జి-20 సదస్సుకు జివిఎంసి తరఫున అన్ని ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని ఒక ప్లాన్ ప్రకారం ప్రతి అధికారికి కొన్ని బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందని ఆయా పనులను ఆయా అధికారులు బాధ్యతతో చేయాలని అతిధులు ప్రయాణించే మార్గం అంతా పరిశుభ్రతతో పాటు పెయింటింగ్, విద్యుత్తు లాంటి పనులు పూర్తి చేయాలని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కమిషనర్లు వై శ్రీనివాస రావు, ఎస్ఎస్ వర్మ, డాక్టర్ వి సన్యాసిరావు, ప్రధాన ఇంజనీరు రవికృష్ణ రాజు, పట్టణ ప్రణాళిక అధికారి సురేష్, డి సి(రెవెన్యూ) ఫణిరాం, కార్యదర్శి నల్లనయ్య, ప్రాజెక్ట్ డైరెక్టర్(యుసిడి) పాపు నాయుడు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవ రెడ్డి, జెడి (అమృత్) విజయ భారతి, జోనల్ కమిషనర్లు, పర్యవేక్షక ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.