మనదేశ బిజినెస్ దిగ్గజం ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే వారి తనయులు, తనయురాలు కూడా బిజినెస్ రంగంలో తాజాగా దూసుకెళ్తున్నారు. ఇదిలావుంటే మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ దీనికి అధినేత. ఈ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్- డిసెంబర్) ఫలితాలను తాజాగా విడుదల చేసింది. నికర లాభం రూ. 15,792 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఈ నికర లాభం 15 శాతం తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 18,549 కోట్ల నికర లాభం ప్రకటించింది. అయితే రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో క్వార్టర్‌లో నికర లాభం 15.6 శాతం మేర పెరిగింది. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం రూ.13,656 కోట్లుగా ఉంది. లాభం కాస్త తగ్గినా.. ఆదాయం పరంగా మాత్రం దుమ్మురేపింది. ఏకంగా 15 శాతం పెరిగి.. రూ.2.4 లక్షల కోట్లుగా నమోదు చేసింది.
అయితే ముకేశ్ అంబానీ తన వ్యాపారాల్లోకి ఎప్పుడో తన వారసులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురికీ తలో వ్యాపార బాధ్యతలను అప్పజెప్పారు. పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి రిలయన్స్ టెలికాం (జియో) బాధ్యతలు అప్పగించగా.. కుమార్తె ఇషా అంబానీకి రిలయన్స్ రిటైల్ బాధ్యతలు ముట్టజెప్పారు. ఇక చిన్న కుమారుడు అనంత్ అంబానీకి మాత్రం.. ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ బిజినెస్ కేటాయించారు. గ్రీన్ ఎనర్జీ బాధ్యతలను స్వయంగా ముకేశ్ అంబానీనే చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఆ లాభాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
ఆకాశ్ అంబానీ చూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం బిజినెస్ రిలయన్స్ జియో ఆదాయం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.29,195 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకు ఇదే రికార్డు. ఇదే సమయంలో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ రూ.12,519 కోట్లుగా ఉంది. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 28.6 శాతం పెరిగి రూ.4881 కోట్లకు చేరింది. ఒక్కో యూజర్‌పై జియోకు సగటు ఆదాయం రూ.178.2 గా ఉంది. గత త్రైమాసికంతో పోలిస్తే జియో కస్టమర్లు పెరిగారు. డిసెంబర్ 31 నాటికి జియోకు 43.29 కోట్ల కస్టమర్లు ఉన్నారు.
అంబానీ కుమార్తె ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ బిజినెస్ కూడా మూడో త్రైమాసికంలో మంచి లాభాలనే ఆర్జించింది. ఆపరేటింగ్ రెవెన్యూ 17 శాతం మేర పెరిగి రూ.67,634 కోట్లుగా నమోదైంది. నికర లాభం కూడా 6.2 శాతం పెరిగి రూ.2400 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో నికర లాభం మాత్రం రూ.2,259 కోట్లుగా ఉంది.
ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ రిఫైనింగ్, పెట్రో కెమికల్స్ బాధ్యతలను చిన్న కుమారుడు అనంత్ అంబానీ చూస్తున్న సంగతి తెలిసిందే. సంవత్సర కాలంగా చూస్తే గనుక ఈ బిజినెస్ ఆదాయంలో 10 శాతం వృద్ధి కనిపించింది. ఈ రెవెన్యూ ఏకంగా 1.44 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ సెగ్మెంట్‌లో ఎగుమతులు కూడా 21 శాతం పెరిగి విలువ రూ.78,331 కోట్లకు చేరింది. ఇది మొత్తం కంపెనీ ఆదాయంలో 54 శాతం.