దేనికైనా కొన్ని పరిమితులుంటాయి. ఇది సోషల్ మీడియా విషయంలోనూ వర్తిస్తుందన్నది తాజాగా స్పష్టమైంది. ఈ మధ్య సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న చాలా మంది.. తమను తాము ఇన్‌ఫ్లుయెన్సర్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు అనే పదం కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. సోషల్ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేసే వారికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ఇక ఇప్పుడు వారి గుండెల్లో బండరాయి పడబోతోంది. ఇక వారు ఏం చేయాలో.. ఏం చేయకూడదో పరిమితులు విధించనుంది. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందులో భాగంగా గరిష్టంగా రూ.50 లక్షల వరకు జరిమానా విధించనుంది. ఇంకా.. జైలు శిక్ష కూడా తప్పకపోవచ్చు. ఈ మేరకు కొత్త గైడ్‌లైన్స్ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
భారత్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెట్ 2025 నాటికి.. రూ.2800 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న దాని కంటే 20 శాతం ఎక్కువ. దీంతో.. ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా.. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్‌పై దృష్టి కేంద్రీకరించింది.
ఈ తరుణంలోనే ఎండార్స్‌మెంట్ నో హౌస్ పేరుతో.. కొత్త మార్గదర్శకాలను వినియోగదారుల వ్యవహారాల శాఖ ఇష్యూ చేసింది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఉండే సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, వర్చువల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది. ఇక కొత్త నిబంధనల మేరకు.. ఇన్‌ఫ్లుయెన్సర్లు పొందే గిఫ్ట్స్, హోటల్ అకాంబ్డేషన్, ఈక్విటీలు, అవార్డ్స్, గిఫ్ట్స్, సర్వీస్- స్కీమ్స్ వంటి అంశాల్లో నిబంధనలకు లోబడి ఉండాలని, లేకపోతే.. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం.. వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనల కింద.. చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వివరించింది. అంతేకాదు బ్యాన్ చేయడం లేదా.. ఎండార్స్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపింది. తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసినందుకుగానూ.. ఇన్‌ఫ్లుయెన్సర్‌పై ఏడాది నుంచి మూడేళ్ల వరకు నిషేధం విధించడం లేదా .. ఎండార్సర్లపై రూ.10 లక్షల జరిమానా.. తీవ్రతను బట్టి గరిష్టంగా రూ.50 లక్షల వరకు జరిమానా కూడా విధించే అవకాశాలున్నాయి.