చైనాతో ఢీ అంటే ఢీ అంటున్న భారత్ తాజాగా జనాభా విషయంలో ఆ దేశాన్ని దాటేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటికే జనాభాలో పొరుగు దేశం చైనాను మించిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనా వేసింది. 2022 చివరి వరకే భారత్ జనాభా 141.7 కోట్లుగా ఉండగా.. చైనా జనాభా 141.2 కోట్లుగా ఉండొచ్చని అభిప్రాయపడింది. ఈ లెక్కన చైనా కంటే భారత్‌లో 50 లక్షల మంది ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. జనవరి 17న చైనా తన జనాభా లెక్కలను ప్రకటించిన విషయం తెలిసిందే. 1960 తర్వాత తొలిసారి చైనాలో జనాభా క్షీణించడం గమనార్హం. దీంతో.. భారత్ కంటే వెనుకకు పడిపోయింది.
భారత మొత్తం జనాభాలో 50 శాతానికిపైగా 30 ఏళ్ల లోపు వారే ఉండటం విశేషం. అంటే సగం మందికిపైగా యువతే ఉంది. దీంతో.. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అంచనా వేయబడింది. ఇక జనవరి 18 వరకు భారత జనాభా 142.3 కోట్లకు చేరి ఉంటుందని WPR పేర్కొంది. భారత్‌లో జనాభా పెరుగుదల కాస్త మందగించినప్పటికీ.. కనీసం 2050 వరకు భారత జనాభా పెరుగుతూనే ఉంటుందని అంచనా వేస్తోంది.
భారత్ జనాభాలో చైనాను అధిగమించి తొలిస్థానానికి చేరుకున్నట్లు పలు అంతర్జాతీయ సంస్థలు ఇదివరకే అంచనా వేయగా.. తాజాగా వరల్డ్ పాపులేషన్ రివ్యూ కూడా అదే మాట చెప్పింది. ఇతర అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ మాక్రోట్రెండ్స్ కూడా ప్రస్తుతం భారత జనాభా 142.8 కోట్లు అని లెక్కగట్టింది. ఇది చైనా ఇటీవల ప్రకటించిన జనాభా కంటే ఎక్కువే. ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు ప్రకటించే భారత్.. ఈసారి కరోనా సృష్టించిన అవాంతరాల నడుమ.. ఆ పని చేయలేకపోయింది. అంతర్జాతీయ సంస్థలు, వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనా వేస్తున్న నేపథ్యంలో.. ఇప్పటికే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్లేనని స్పష్టం అవుతోంది.
చైనాలో ఇటీవల అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్ మహమ్మారి విజృంభించగా లెక్కలేనన్ని సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. మరోవైపు జననాల రేటు తగ్గుతోంది. వయోవృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఈ నేపథ్యంలోనే తమ జనాభా తగ్గినట్లు చైనా ఇటీవల పేర్కొంది. చైనా జనాభాను.. భారత్ 2023 నాటికి అధిగమిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేయగా.. అది కాస్త ముందుగానే చేరుకున్నట్లు తెలుస్తోంది. 2025 చివరికల్లా భారత దేశ జనాభా ఏకంగా 167 కోట్లను తాకుతుందని ఐరాస అభిప్రాయపడింది. ఇక ప్రపంచ జనాభా కూడా ఇటీవలే 800 కోట్ల మైలురాయిని దాటిన విషయం తెలిసిందే. 1974లో ప్రపంచ మొత్తం జనాభా 400 కోట్లుగా ఉండగా.. 48 సంవత్సరాల్లో డబుల్ అయి 800 కోట్లకు చేరింది.