క్రియేటర్ కు యూట్యూబ్ ఓ ఆదాయ వనరుగా మారుతోంది. దీంతో యూట్యూబ్ ఎంతో మంది జీవితాలను మార్చేస్తోంది. యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. ఉద్యోగులకే కంటే ఎక్కువగా సంపాదించే వారు ఎంతో మంది ఉన్నారు. చిన్న క్రియేటివిటీతో తమ జీవితాలను సమూలంగా మార్చేసుకుంటున్నారు. దీనికి తోడు పాపులారిటీ, అభిమానం కూడా సంపాదించుకునే వారు ఎంతో మంది ఉన్నారు. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ వచ్చిన సంపాదనతో ఏకంగా ఆడీ కారు కొన్నాడు. ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా నిలిచాడు. ఆ కొత్త కారును పశువుల పాక పక్కనే పార్క్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. బిహార్‌లోని ఔరంగాబాద్ పరిధిలోని జసోయా గ్రామానికి చెందిన 27 ఏళ్ల ఆ యువకుడి పేరు హర్ష్ రాజ్‌పుత్ . జాతీయ వార్తా కథనాల ప్రకారం.. యూట్యూబ్ వీడియోల ద్వారా అతడు నెలకు 8 లక్షల రూపాయల వరకూ సంపాదిస్తున్నాడు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో కామెడీ వీడియోలు చేసి యూట్యూబ్‌లో పోస్టు చేయడం మొదలుపెట్టాడు హర్ష. అతడి కామెడీ టైమింగ్ చాలా మందిని ఆకట్టుకుంది. కొన్ని వీడియోలు బాగా పేలాయి. 10 నిమిషాల నిడివి గల ఓ కామెడీ వీడియోకు 20 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చిన సంపాదనతో సుమారు రూ. 50 లక్షల విలువైన ఆడీ కారు కొన్నాడు.
రకరకాల సమస్యలపై ఫన్నీగా వీడియోలు చేయడం హర్ష్ రాజ్‌పుత్ ప్రత్యేకత. అతడు చేసిన కొన్ని వీడియోల్లో కొంత భాగం వైరల్ అయిన సందర్భాలు అనేకం. ప్రస్తుతం హర్ష్ రాజ్‌పుత్ యూట్యూబ్ ఛానల్‌కు 33 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. జూన్ 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు హర్ష్ నెలకు సగటున రూ. 4.5 లక్షలు సంపాదించాడు.
హర్ష్ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అతడి తండ్రి బీహార్ పోలీసులకు హోంగార్డుగా, పోలీసు అధికారులకు డ్రైవర్‌గా పనిచేశాడు. నటనపై ఆసక్తితో హర్ష్.. ముంబైకి వెళ్లాడు. అంతకుముందు ఢిల్లీలో థియేటర్ కోర్సు చేశాడు. అయితే, కోవిడ్ లాక్‌డౌన్ అతడి ఆశలపై నీళ్లు చల్లింది. కానీ, అదే సమయం అతడికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. లాక్‌డౌన్ సమయంలోనే అతడు తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. తనదైన కామెడీతో వీడియోలు చేసి పోస్టు చేయడం మొదలుపెట్టాడు. అవి బాగా వర్కవుట్ అయ్యాయి.
బ్యాంక్ రుణం తిరిగి చెల్లించని కారణంగా ఒకనాడు హర్ష్ ఇంటిని అధికారులు వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. హర్ష్ తన యూట్యూబ్ సంపాదన ద్వారా ఆ ఇంటిని కూడా దక్కించుకున్నాడు. నటుడిగా అవకాశాలు వచ్చినా ఇంత షార్ట్ పీరియడ్‌లో ఈ స్థాయిలో సంపాదించేవాడో, లేదో..!